ఏపీకి టెక్ పెట్టుబడులు.. ఇంటెల్, ఎన్విడియాతో లోకేశ్ చర్చలు

  • ఏపీలో ఏటీఎంపీ యూనిట్, ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఇంటెల్‌కు ప్రతిపాదన
  • స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ఎన్విడియాకు విజ్ఞప్తి
  • రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని రెండు సంస్థలను కోరిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన ఇంటెల్, ఎన్విడియా సంస్థల ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.

శాంటాక్లారాలోని ఇంటెల్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల తయారీకి బలమైన పారిశ్రామిక వాతావరణం ఉందని తెలిపారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఐఐటీ తిరుపతి లేదా ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో "ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్" ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఇంటెల్ శిక్షణ కార్యక్రమాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, యూనివర్సిటీలలో "ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్" స్థాపించాలని సూచించారు.


అనంతరం, చిప్ డిజైనింగ్ దిగ్గజం ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్ పూరితో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్విడియా టెక్నాలజీతో ఒక "స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్" ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఏపీలోని డీప్‌టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు, మెంటారింగ్ అందించాలని, ప్రభుత్వ అధికారులకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రతిపాదనలపై ఎన్విడియా ప్రతినిధి రాజ్ మిర్ పూరి సానుకూలంగా స్పందించారు. భారత్‌లో తమకు బెంగళూరులో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


More Telugu News