అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: ఏపీ హోంమంత్రి అనిత భరోసా

  • హోంమంత్రి అనితతో భేటీ అయిన అగ్రిగోల్డ్ బాధితులు
  • కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్
  • గత ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమైందని ఆరోపణ
  • ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని మంత్రి అనిత భరోసా
అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని బాధితుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సచివాలయంలో నిన్న హోంమంత్రి వంగలపూడి అనితతో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అనిత హామీ ఇచ్చారు.
 
ఈ సమావేశం అనంతరం యూనియన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 8 రాష్ట్రాల్లోని బాధితుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.7,386 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నాటి సీఐడీ చీఫ్ కేసును నీరుగార్చారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సాయం అందక రాష్ట్రంలో సుమారు 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
రాష్ట్రంలో 9.50 లక్షల మందికి రూ.3,080 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే కొందరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అడ్డుకుంటున్నారని నాగేశ్వరరావు అన్నారు. 14 వేల మంది బాధితులు కొనుగోలు చేసిన స్థలాలను అటాచ్‌మెంట్ల నుంచి తొలగించాలని కోరారు. ఈ కేసుపై వెంటనే సిట్ ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా న్యాయం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 
 బాధితుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి అనిత, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధితులు అధైర్యపడి ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.
 
 


More Telugu News