Pieter Elbers: మిమ్మల్ని నిరాశపరిచాం... క్షమాపణలు కోరుతున్నా: ఇండిగో సీఈవో

Indigo CEO Pieter Elbers Apologizes for Flight Disruptions
  • ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసిన సీఈవో
  • సర్వీసుల రద్దు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు గాడిన పడుతున్నాయని వెల్లడి
  • సంక్షోభం కారణంగా వేలాదిమంది ప్రయాణాలు కొనసాగించలేకపోయారని ఆవేదన
ప్రయాణికులను తీవ్రంగా నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సర్వీసుల రద్దు ఈ రోజు కూడా కొనసాగినప్పటికీ, పరిస్థితులు గాడిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షోభంపై సీఈవో స్పందించారు.

సంక్షోభం తర్వాత ఇండిగో మళ్లీ తన కాళ్లపై నిలబడిందని ఆయన తెలిపారు. తమ వైఫల్యం కారణంగా ప్రయాణికులను తీవ్రంగా నిరాశపరిచినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ప్రయాణాలు చేస్తుంటారని, సంక్షోభం కారణంగా వేలాది మంది తమ ప్రయాణాలను కొనసాగించలేకపోయారని, ఇందుకు హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు.

లక్షలాది మంది ప్రయాణికులు రిఫండ్లను పొందినట్లు గుర్తుచేశారు. మిగిలిన ప్రయాణికులకు కూడా రిఫండ్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారి లగేజీని ఇంటి వద్దకు చేర్చామని అన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. నిన్నటి నుంచి వందకు పైగా గమ్యస్థానాలకు ఇండిగో సర్వీసులు ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తున్నామని అన్నారు.

తాము విమానాల రద్దును నివారించలేకపోయామని, తమ ఇండిగో బృందం కష్టపడి పని చేస్తుందని హామీ ఇస్తున్నామని అన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం తమ ముఖ్య ప్రాధాన్యత అని అన్నారు. సంక్షోభం ఉన్నప్పటికీ తమ సేవలను వినియోగించుకుంటున్నారని, విమానాలను బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. ఇది తమకు ప్రోత్సాహకరంగా ఉందని, తాము తప్పుల నుంచి పాఠాలను నేర్చుకున్నామని అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు.
Pieter Elbers
Indigo CEO
Indigo flights
flight cancellations
refunds
airline crisis

More Telugu News