India vs South Africa: 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా... 101 పరుగుల తేడాతో టీమిండియా విన్

India Beats South Africa by 101 Runs in First T20
  • కటక్ లో మ్యాచ్
  • 176 పరుగుల ఛేజింగ్ లో చేతులెత్తేసిన సఫారీలు
  • 12.3 ఓవర్లలోనే ఆలౌట్
  • టీమిండియా ఆల్ రౌండ్ షో
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన ముందు సఫారీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు, కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (14), కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (14) కాసేపు నిలబడినా, స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. కీలక బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ (1), డొనోవాన్ ఫెరీరా (5) పూర్తిగా విఫలమయ్యారు. ఒక దశలో డివాల్డ్ బ్రెవిస్ (22) కాస్త దూకుడుగా ఆడినా, అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సఫారీ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్‌గా నిలవడం వారి బ్యాటింగ్ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టి సఫారీ పతనాన్ని శాసించారు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఒక దశలో 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. కేవలం 28 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 59 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనికి తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) నుంచి సహకారం లభించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీశాడు.

ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 11న న్యూ ఛండీగఢ్ లో జరగనుంది.
India vs South Africa
India
South Africa
T20
Cricket
Hardik Pandya
Arshdeep Singh
Jasprit Bumrah
Quinton de Kock
Cricket Match

More Telugu News