Hardik Pandya: దక్షిణాఫ్రికా టార్గెట్ 176 పరుగులు... అప్పుడే 4 వికెట్లు పడగొట్టిన భారత్

India vs South Africa India Takes Early Wickets After Hardik Pandya Blitz
  • హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధశతకంతో ఆదుకున్న వైనం
  • దక్షిణాఫ్రికా ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్
  • సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడికి మూడు వికెట్లు
  • ఛేదనలో ఆదిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా మెరుగైన ఆటతీరుతో ప్రదర్శించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (59 నాటౌట్) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ రాణించి ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బతీసింది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా, తాజా సమాచారం అందేసరికి 6.2 ఓవర్లలో 45 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. శుభ్‌మన్ గిల్ (4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), అభిషేక్ శర్మ (17) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా స్కోరు వేగం పెంచలేకపోయారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లతో రాణించగా, సిపామ్లా 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను అర్షదీప్ సింగ్ డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. కాసేపటికే ప్రమాదకర ట్రిస్టన్ స్టబ్స్ (14)ను కూడా అర్షదీప్ ఔట్ చేయగా, కెప్టెన్ మార్ క్రమ్ (14)ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (1) ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది.  దీంతో సఫారీ జట్టు ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. 
Hardik Pandya
India vs South Africa
IND vs SA
T20 Match
Cricket
Arshdeep Singh
Markram
Barabati Stadium
Lungi Ngidi
Quinton de Kock

More Telugu News