Revanth Reddy: 83 పేజీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

Revanth Reddy Unveils Telangana Vision 2047 Document
  • విజన్ డాక్యుమెంట్‌‍ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
  • తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విజన్ డాక్యుమెంట్
  • 10 కీలక ప్రణాళికలతో డాక్యుమెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ విజన్ 2047' డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' ముగింపు సందర్భంగా 83 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు. 'తెలంగాణ మీన్స్ బిజినెస్' పేరుతో ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. 10 కీలక ప్రణాళికలతో ఈ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు.

సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విజన్ డాక్యుమెంట్ కోసం ఆన్‌లైన్ ద్వారా సూచనలు, సలహాలు వచ్చాయని అన్నారు. ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ విజన్ డాక్యుమెంటుకు 4 లక్షల మంది ప్రజలు ఆన్‌లైన్‌లో సూచనలు, సలహాలు ఇచ్చారని వెల్లడించారు.

నిపుణులు ఎంతోమంది ఈ విజన్ డాక్యుమెంట్‌లో భాగస్వాములు అయ్యారని తెలిపారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు.

తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి పెరిగానని, వారి సమస్యలు తనకు తెలుసని అన్నారు. పేదరికం నిర్మూలన, పేద ప్రజల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. చైనా, జపాన్, కొరియా దేశాలను రోల్ మోడల్‌గా తీసుకున్నట్లు తెలిపారు. పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ధి ఫలాలు దక్కేలా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని అన్నారు.
Revanth Reddy
Telangana Vision 2047
Telangana Rising Global Summit 2025
Telangana economy

More Telugu News