Chandrababu Naidu: స్క్రబ్ టైఫస్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్... కట్టడికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Orders Task Force on Scrub Typhus Control
  • రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • అధ్యయనం కోసం జాతీయ స్థాయి నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశం
  • రాష్ట్రంలో 1,592 స్క్రబ్ టైఫస్ కేసులు, చిత్తూరులో అత్యధికం
  • సీజనల్ వ్యాధులు 48 శాతం తగ్గుముఖం పట్టాయని తెలిపిన అధికారులు
  • అపరిశుభ్రతే అసలు జబ్బని, ప్రజల్లో చైతన్యం పెంచాలని సీఎం సూచన
రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు, దానిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రతే అనేక వ్యాధులకు మూలకారణమని, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రతపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,592 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి కారణంగానే మరణాలు సంభవించినట్లు ఇప్పటివరకు ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అనుమానిత మరణాలుగా నమోదైన 9 కేసులను పరిశీలించగా, ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే వారు మరణించినట్లు తేలిందని వివరించారు. 

స్క్రబ్ టైఫస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉందని, తమిళనాడు, ఒడిశాలలో ఏకంగా 7 వేలకు పైగా కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ నివేదికపై స్పందించిన ముఖ్యమంత్రి, స్క్రబ్ టైఫస్‌ను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. తక్షణమే జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, వ్యాధి వ్యాప్తికి గల కారణాలను విశ్లేషించి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

సీజనల్ వ్యాధులు 48 శాతం తగ్గుముఖం

గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి కారణాలతో మొత్తం సీజనల్ వ్యాధులు 48 శాతం తగ్గాయని తెలిపారు. 

ముఖ్యంగా డెంగ్యూ కేసులు 56 శాతం, చికున్‌గున్యా 46.5 శాతం, మలేరియా 11 శాతం మేర తగ్గాయని వివరించారు. పరిశుభ్రతను పెంచడం ద్వారా సీజనల్ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతేనని, దానిపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, కమిషనర్ వీరపాండ్యన్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో దినేష్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ గిరీశా తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Scrub typhus
Andhra Pradesh
Task force
Disease control
Public health
Seasonal diseases
Hygiene
Chittoor district
Health department

More Telugu News