Ayyappa: అక్కడకు వెళ్లవద్దు: అయ్యప్ప భక్తులకు కేరళ అటవీ అధికారుల కీలక సూచన

Ayyappa Pilgrims Advised to Avoid Uralukuzhi Waterfalls by Kerala Forest Department
  • ఉరళ్‌కుళి జలపాదాన్ని సందర్శించవద్దని సూచన
  • వన్యప్రాణుల దాడులు, తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న అధికారులు
  • భక్తుల భద్రత దృష్ట్యా సన్నిధానం సూచన జారీ చేసిన స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులకు కేరళ అటవీ శాఖ అధికారులు ముఖ్యమైన సూచనలు చేశారు. వన్యప్రాణుల దాడులు, ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నందున ఆలయం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు, ఆ ప్రాంతంలోని భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల భద్రత దృష్ట్యా సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ ఈ సూచనలు జారీ చేశారు.

అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్లే కొందరు భక్తులు ఉరళ్‌కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారని బాలకృష్ణన్ తెలిపారు. పండితవాళనికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం వద్ద ఇటీవల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ ప్రాంతంలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించబడిందని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంటుందని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ జలపాతానికి దూరంగా ఉండాలని భక్తులకు సూచించారు. జలపాతానికి వెళ్లే మార్గం జారే స్వభావం కలిగి ఉండటం వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి, శబరిమల వచ్చే భక్తులు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Ayyappa
Sabarimala
Kerala Forest Department
Uralukuzhi Waterfalls
Ayyappa Swamy

More Telugu News