Pakistan Taliban: పాక్‌లో చెక్‌పోస్ట్‌పై ఉగ్రదాడి.. ఆరుగురు సైనికులు మృతి

Six Soldiers Killed in Pakistan Checkpost Attack by TTP
  • పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉద్రిక్తత
  • కాల్పుల్లో ఆరుగురు సైనికులు మృతి, నలుగురికి గాయాలు
  • ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు
పాకిస్థాన్‌లోని వాయవ్య ప్రాంతంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో ఉన్న ఓ సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌పై సాయుధుల బృందం దాడి చేసింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.

భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్ (టీటీపీ) ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో టీటీపీ దాడులు పెరిగాయి. వీరికి ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను కాబూల్ ఖండిస్తోంది. ఇది పాకిస్థాన్ అంతర్గత భద్రతా సమస్య అని స్పష్టం చేస్తోంది.

ఇటీవలే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్, టర్కీ, సౌదీ అరేబియా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్థాన్ బలవంతంగా వెనక్కి పంపడం కూడా ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. 
Pakistan Taliban
Pakistan
TTP attack
Kurram district
Khyber Pakhtunkhwa
Terrorist attack
Afghanistan
Pakistan security
Taliban
Checkpost attack

More Telugu News