'సోనీ లివ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి స్పోర్ట్స్ డ్రామాకి సంబంధించిన ఒక సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ పేరే 'రియల్ కశ్మీర్ ఫుట్ బాల్ క్లబ్'. మహేశ్ మత్తాయి - రాజేశ్ మాపుస్కర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ రూపొందిన ఈ సిరీస్ కశ్మీర్ నేపథ్యంలో నడుస్తుంది. మానవ కౌల్ .. జీషాన్ ఆయూబ్ ప్రధానమైన పాత్రలను పోషించిన సిరీస్ ఇది. 

కథ: 2016లో .. శ్రీనగర్ లో ఈ కథ నడుస్తూ ఉంటుంది. శ్రీనగర్ లో శిరీశ్ (మానవ్ కౌల్) ఒక వైన్స్ షాప్ నడుపుతూ ఉంటాడు. అయితే ఆ వైన్ షాప్ ను అక్కడి నుంచి తీసేయమని స్థానికులు గొడవచేస్తూ ఉంటారు. శిరీశ్ .. ఆయన భార్య కావేరికి ఈ విషయం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే తమ షాప్ కి అన్ని రకాల అనుమతులు ఉన్న కారణంగా వాళ్లు ధైర్యంగానే ఉంటారు. అక్కడికి దగ్గరలోనే సోహెల్ ( జీషాన్ ఆయూబ్) దంపతులు నివసిస్తూ ఉంటారు. 

సోహెల్ నిజాయితీ కారణంగా అతను ఏ జాబ్ లోను నిలదొక్కుకోలేకపోతుంటాడు. కశ్మీర్ కి ఫుట్ బాల్ టీమ్ లేకపోవడం గమనించిన ఆయన, ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ టీమ్ ను తయారు చేయాలని భావిస్తాడు. అందుకోసం 'రియల్ కశ్మీర్ ఫుట్ బాల్ క్లబ్' ను స్థాపించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఫుట్ బాల్ పట్ల ఆసక్తి ఉన్న యువకులు .. కోచ్ .. ఇన్వెస్టర్ అవసరమని భావిస్తాడు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెడతాడు. 

సోహెల్ ఆశయాన్ని అర్థం చేసుకున్న శిరీష్ ఇన్వెస్టర్ గా ఉండటానికి అంగీకరిస్తాడు. అలాగే కోచ్ గా ఉండటానికి ముస్తఫా ఒప్పుకుంటాడు. ఆల్రెడీ ఫుట్ బాల్ ఆటగాడిగా మంచి పేరున్న 'షా' ఈ టీమ్ లో ఆడటానికి ముందుకు వస్తాడు. అయితే అతనికీ .. ముస్తఫాకి పడదనే విషయం అప్పుడే సోహెల్ కి తెలుస్తుంది. ఉత్సాహంతో ఉన్న యువకులకు శిక్షణ మొదలవుతుంది. తమ జట్టు DFOతో రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? సోహెల్ కల నిజమవుతుందా? అనేది కథ. 

విశ్లేషణ: కశ్మీర్ కి ఒక ఫుట్ బాల్ టీమ్ లేకపోవడం, ఆ ప్రాంతానికి చెందిన సోహెల్ కి అసంతృప్తిగా అనిపించడం .. చేసే పని తనకి ఆత్మసంతృప్తిని కలిగించేదై ఉండాలని భావించడం దగ్గర నుంచే ఈ కథ మొదలవుతుంది. లక్ష్య సాధన విషయంలో తనకి ఎదురవుతూ వచ్చిన సమస్యలను ఆయన ఎలా ఎదుర్కుంటూ వెళ్లాడనే విషయాన్ని ఆవిష్కరించే కథ ఇది.

ఒక వైపున శ్రీనగర్లో ఉన్న పరిస్థితులు .. మరొక వైపున ఫుట్ బాల్ క్రీడకు సంబంధించిన ప్రతికూల ప్రరిస్థితులు .. ఆవేశాలు .. అపార్థాలు .. అనర్థాలు .. ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల తాలూకు కుటుంబాలు ..  అక్కడి ఎమోషన్స్ ను దర్శకుడు ఆవిష్కరిస్తూ వెళ్లాడు.

ఒక ఆశయంతో రంగంలోకి దిగినప్పుడు ఎన్నో ఆటంకాలు .. అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ప్రతికూల పరిస్థితులలోను వెనకడుగు వేయకూడదనే సందేశాన్ని ఇచ్చే సిరీస్ ఇది. జట్టులోని వారంతా ఎవరికి వారుగా కాకుండా అంతా కలిసికట్టుగా ఆడినప్పుడే విజయం సాధించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సిరీస్ స్పష్టం చేస్తుంది. అయితే బలమైన ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలను డిజైన్ చేసుకోకపోవడం వలన, ఈ కంటెంట్ ఆశించిన స్థాయిలో ప్రభావితం చేయలేకపోతుంది.

పనితీరు: కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ కథ చాలా నిదానంగా .. నింపాదిగా అనిపిస్తుంది. ఎంచుకున్న కథ ఆసక్తికరమైనదే అయినా, ప్రేక్షకులను ప్రభావితం చేసే స్థాయిలో అది తెరపై ఆవిష్కరించడం జరగలేదని అనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఈ కథ నడిచినప్పటికీ, కథనంలో వేగం లేకపోవడం కూడా అసహనాన్ని కలిగిస్తుంది. 

ముగింపు: ఇది ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే కథ అనే విషయం టైటిల్ తోనే అర్థమవుతుంది. అయితే ఫుట్ బాల్ గేమ్ చుట్టూ అల్లుకున్న కథ .. ఫ్యామిలీ ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కావు. గేమ్ కి సంబంధించిన సీన్స్ కూడా అంత ఆసక్తికరంగా అనిపించవు. అందువలన ఇది ఓ మాదిరి సిరీస్ గా మాత్రమే అనిపిస్తుంది.