Harish Rao: కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు... ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు: హరీశ్ రావు

Harish Rao Says KCR is Healthy
  • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్న హరీశ్
  • కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని వ్యాఖ్య
  • తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం మరో పోరాటానికి పిలుపు
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘విజయ దీక్షా దివస్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గత రెండేళ్లుగా రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. "తెలంగాణ ఉద్యమ ద్రోహుల చరిత్ర రాస్తే, అందులో రేవంత్ రెడ్డి పేరే రాయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు ఆయనకు లేదు" అని మండిపడ్డారు. కాళోజీ, దాశరథి, గద్దర్ అవార్డులను కాదని, రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని రేవంత్ మాట్లాడటం రాష్ట్ర పురస్కారాలను అవమానించడమేనని అన్నారు.

కేసీఆర్ త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని హరీశ్‌రావు గుర్తుచేశారు. "కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ ప్రకటన వచ్చేది కాదు. పదవులను గడ్డిపోచలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్‌లో ప్రాణాల మీదకు వచ్చినా దీక్ష విరమించలేదు. అలాంటి కేసీఆర్‌ను ప్రజల ఆశీర్వాదం కాపాడుతోంది. ఆయన ఆరోగ్యం బాగుంది. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు" అని తెలిపారు.

ప్రజలకు పాలకుల మధ్య తేడా ఇప్పటికే అర్థమైందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
Harish Rao
KCR
Telangana
Revanth Reddy
BRS
Telangana Politics
Telangana History
Telangana Movement
Kaloji Award
Dasaradhi Award

More Telugu News