కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..!

  • సిద్ధరామయ్య పూర్తికాలం సీఎం అంటూ కుమారుడు యతీంద్ర వ్యాఖ్యలు
  • యతీంద్ర వ్యాఖ్యలపై డీకే శివకుమార్ ఆసక్తికర స్పందన
  • బెళగావిలో "డీకే నెక్ట్స్ సీఎం" అంటూ మద్దతుదారుల నినాదాలు
  • అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే... ముఖ్యమంత్రి మార్పు ఉండదని, సిద్ధరామయ్య పూర్తికాలం పదవిలో కొనసాగుతారని, డీకే శివకుమార్ డిమాండ్‌ను అధిష్ఠానం తోసిపుచ్చిందని యతీంద్ర సోమవారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈ రోజు బెంగళూరులో మీడియా ప్రశ్నించగా.. డీకే శివకుమార్ కేవలం "చాలా సంతోషం. అంతా మంచే జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి" అని క్లుప్తంగా బదులిచ్చారు.

ఆ తర్వాత, శీతాకాల సమావేశాల కోసం బెళగావి విమానాశ్రయానికి చేరుకున్న డీకే శివకుమార్‌కు మద్దతుదారులు "డీకే నెక్ట్స్ సీఎం" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు డీకే సన్నిహితురాలైన మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ సోదరుడు, ఎమ్మెల్సీ చన్నరాజ్ హట్టిహోళి.. తన సోషల్ మీడియా ఖాతాలో డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి అని సంబోధిస్తూ పోస్ట్ చేయడం కలకలం రేపింది.

యతీంద్ర వ్యాఖ్యలు అనవసరమని చన్నరాజ్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవిపై అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు, అంతవరకూ వేచి చూడాలని సూచించారు. ఈ పరిణామాలపై రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందిస్తూ, పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. అయితే, నేతలు బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు.

మొత్తం మీద నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. సీఎం కుర్చీ చుట్టూ ఇరు వర్గాల మద్దతుదారుల వ్యాఖ్యలు, నినాదాలు కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరును మరోసారి బహిర్గతం చేశాయి.


More Telugu News