Donald Trump: ట్రంప్ టారీఫ్ ల వెనక అసలు ఉద్దేశం వేరే అంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్

Raghuram Rajan Reveals Real Reason Behind Trump Tariffs on India
  • రష్యా చమురు కొనుగోళ్లు కారణం కాదనీ, వ్యక్తిగత వైరమేనని వ్యాఖ్య
  • భారత్ – పాక్ యుద్ధ విరమణ క్రెడిట్ కోసం ట్రంప్ పట్టు
  • కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదనడం వల్లే భారత్ పై టారీఫ్ లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీ మొత్తంలో సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే కారణమని ట్రంప్ చెప్పినప్పటికీ అసలు కారణం మాత్రం ఇది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లు కేవలం ఒక సాకు మాత్రమేనని, వ్యక్తిగత వైరమే అసలు కారణమని ఆయన చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతగా పాకులాడారో అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తుచేశారు. శాంతి బహుమతి పొందడానికి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ ప్రచారం చేసుకున్నారని తెలిపారు.

ఇందులో భాగంగానే భారత్, పాక్ మధ్య అణు యుద్ధాన్ని నిలువరించినట్లు ట్రంప్ చెప్పుకున్నారు. ఇరు దేశాలనూ టారిఫ్ లతో బెదిరించి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేశానని ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రచారానికి పాక్ వంతపాడగా.. భారత్ మాత్రం ఎప్పటికప్పుడు ఖండించింది. పాకిస్థాన్ సైన్యం ప్రాధేయపడడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రధాని మోదీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా సహా మరే ఇతర దేశ ప్రమేయం లేదని పేర్కొన్నారు.

ఈ విషయంలో తనకు క్రెడిట్ ఇవ్వలేదనే ఆగ్రహంతో భారత్ పై ట్రంప్ కక్ష పెంచుకున్నారని, ఆ కోపంతోనే భారీగా టారీఫ్ లు విధించారని రఘురామ్ రాజన్ ఆరోపించారు. ఈ విషయంలో ట్రంప్ ప్రచారానికి వంత పాడడం ద్వారా పాక్ ప్రయోజనం పొందిందని చెప్పారు. పాకిస్థాన్ పై 19 శాతం టారీఫ్ లు విధించిన ట్రంప్.. భారత్ పై మాత్రం 50 శాతం సుంకాలు వడ్డించడానికి ఇదే కారణమని చెప్పారు. రష్యా చమురు కొనుగోళ్లు అమెరికాకు ఎప్పుడూ ప్రధాన సమస్య కాదని రఘురామ్ రాజన్ చెప్పారు. తాజాగా హంగేరీలో విక్టర్ ఓర్బన్ రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ మినహాయింపు ఇవ్వటాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
Donald Trump
Raghuram Rajan
India
Tariffs
RBI Governor
Narendra Modi
Pakistan
Russia oil

More Telugu News