Starlink: భారత్‌లో స్టార్‌లింక్ ధరలపై గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ

Starlink India Price Confusion Clarified by Company
  • స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం
  • భారత్‌లో సేవల ధరలు ఇవేనంటూ కనిపించిన వివరాలు
  • అవి వాస్తవ ధరలు కావంటూ స్పష్టతనిచ్చిన కంపెనీ
  • ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి
  • ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతో స్టార్‌లింక్ ఒప్పందం
ప్రముఖ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో సోమవారం కొంత గందరగోళం నెలకొంది. భారత్‌లో అందించే సేవల ధరల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించడంతో అవి ఖరారయ్యాయని చాలామంది భావించారు. అయితే, ఇది కేవలం ఒక సాంకేతిక లోపం వల్లే జరిగిందని, ఆ ధరలు వాస్తవమైనవి కావని కంపెనీ స్పష్టతనిచ్చింది. 

వెబ్‌సైట్‌లో కనిపించిన వివరాల ప్రకారం నెలవారీ సేవలకు రూ.8,600, హార్డ్‌వేర్ కిట్ కోసం రూ.34,000 చెల్లించాలని ఉంది. ఈ విషయంపై స్పేస్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ 'ఎక్స్‌' (ట్విట్టర్) ద్వారా స్పందించారు. "స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. మేము కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదు. వెబ్‌సైట్‌లో కనిపించిన ధరలు కేవలం టెస్టింగ్ కోసం పెట్టిన డమ్మీ డేటా మాత్రమే. ఒక చిన్న కాన్ఫిగరేషన్ లోపం వల్ల అవి కనిపించాయి. దాన్ని వెంటనే సరిచేశాం" అని ఆమె వివరించారు.

భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం ప్రభుత్వ తుది అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని డ్రేయర్ తెలిపారు. అనుమతులు రాగానే అధికారికంగా వెబ్‌సైట్, సేవల వివరాలను ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికే స్టార్‌లింక్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ ఒప్పందం జరిగింది. మరోవైపు బెంగళూరు కేంద్రంగా పలు కీలక ఉద్యోగాలకు నియామకాలు చేపట్టడం ద్వారా భారత్‌లో కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Starlink
Starlink India
SpaceX
Elon Musk
Satellite Internet
Internet Services
India Internet
Lauren Dreyer
Maharashtra Government
High Speed Internet

More Telugu News