Pradeep Krishnan: ఆ ఒక్క మాటతో మనసులు గెలిచాడు.. ఇండిగో పైలట్‌పై ప్రశంసల వర్షం.. వీడియో ఇదిగో!

Pilot Pradeep Krishnan wins hearts with apology for Indigo flight delays
  • కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తమిళంలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • పైలట్ నిజాయతీకి చప్పట్లతో అభినందనలు తెలిపిన ప్రయాణికులు
  • గ్రౌండ్ స్టాఫ్‌పై దయ చూపాలని ప్రయాణికులను కోరిన కెప్టెన్
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు భారీగా రద్దవుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, ఆ సంస్థకు చెందిన ఓ పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది. విమానంలో ప్రయాణికులకు తమిళంలో క్షమాపణ చెబుతూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఇండిగో పైలట్ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తాను నడుపుతున్న విమానంలో ప్రయాణికుల వద్దకు వచ్చి ఆలస్యానికి క్షమాపణలు తెలిపారు. "మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం" అని ఆయన తమిళంలో వినమ్రంగా చెప్పారు. ఆయన నిజాయతీకి ముగ్ధులైన ప్రయాణికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కెప్టెన్ ప్రదీప్, ఒక భావోద్వేగపూరిత క్యాప్షన్ కూడా జతచేశారు. "నన్ను క్షమించండి. విమానం ఆలస్యం కారణంగా ముఖ్యమైన పనులు కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మేమేమీ సమ్మె చేయడం లేదు. పైలట్లుగా మేం మా వంతు కృషి చేస్తున్నాం. మేం కూడా మా ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నాం" అని పేర్కొన్నారు. కోయంబత్తూర్‌కు వెళ్తున్న తన విమానం కూడా ఆలస్యమైందని, ప్రయాణికులు ఎంతో ఓపికగా సహకరించారని తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో విమానాశ్రయాల్లోని తమ గ్రౌండ్ స్టాఫ్‌తో దయతో మెలగాలని ఆయన ప్రయాణికులను కోరారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్లిష్ట సమయంలో పైలట్ చూపిన మానవత్వం, వినయం అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు.

కొత్త పైలట్ విశ్రాంతి నిబంధనల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడటంతో ఇండిగోలో సంక్షోభం ఏడో రోజుకు చేరింది. సోమవారం 150కి పైగా, ఆదివారం 650కి పైగా విమానాలను సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే.
Pradeep Krishnan
Indigo flights
flight cancellations
pilot apology
Coimbatore flight
flight delay
pilot shortage
new pilot rest rules
airport ground staff
Tamil Nadu

More Telugu News