IPL 2026 Auction: ఐపీఎల్ వేలం: 1005 మందికి షాక్.. తుది జాబితాలో 350 మంది మాత్రమే!

A total of 350 players will go under the hammer in the IPL 2026 auction
  • ఐపీఎల్ 2026 మినీ వేలం జాబితా ఖరారు
  • ఫ్రాంచైజీల అభ్యర్థనతో జాబితాలో చేరిన క్వింటన్ డికాక్ 
  • ఈ నెల‌ 16న అబుదాబిలో జరగనున్న వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలానికి సంబంధించిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసింది. మొదట రిజిస్టర్ చేసుకున్న వారిలో నుంచి ఏకంగా 1005 మంది పేర్లను తొలగించి, కేవలం 350 మందితో ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఆసక్తికరంగా తొలుత రిజిస్టర్ చేసుకోని 35 మంది కొత్త ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు కల్పించడం విశేషం.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ పేరు చేరడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డికాక్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. కానీ, కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా అభ్యర్థించడంతో బీసీసీఐ అతని పేరును చేర్చింది. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డికాక్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. గత వేలంలో రూ.2 కోట్ల కనీస ధర పలికిన డికాక్, ఈసారి తన బేస్ ప్రైస్‌ను రూ.1 కోటికి తగ్గించుకున్నాడు.

డికాక్‌తో పాటు శ్రీలంక ఆటగాళ్లు ట్రావీన్ మాథ్యూ, బినుర ఫెర్నాండో, కుశాల్ పెరీరా, దునిత్ వెల్లలాగే వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా కొత్తగా జాబితాలో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అరబ్ గుల్, వెస్టిండీస్ ప్లేయర్ అకీమ్ ఆగస్టే తొలిసారిగా ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దేశవాళీ ఆటగాళ్లలో విష్ణు సోలంకి, సాదెక్ హుస్సేన్ సహా మరో 20 మందికి అవకాశం దక్కింది.

కామెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్ అత్యధికంగా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో జాబితాలో ఉన్నారు.

350 మంది ఆటగాళ్లు.. 77 స్లాట్ల కోసం పోటీ 
ఈ వేలంలో మొత్తం 350 మంది ఆటగాళ్ల‌లో అన్ని ఫ్రాంచైజీలు కలిపి 77 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉండగా, ఇందులో 31 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. ఈసారి వేలం ప్రక్రియలో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. మార్క్యూ ఆటగాళ్ల జాబితా లేకుండానే నేరుగా క్యాప్‌డ్, ఆ తర్వాత అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లతో వేలం ప్రారంభిస్తారు. తొలి 70 మంది తర్వాత యాక్సిలరేటెడ్ పద్ధతిలో మిగిలిన ఆటగాళ్ల వేలం వేగంగా జరుగుతుంది.

ఈ వేలం ప్రక్రియ ఈ నెల‌ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం ప్రారంభమవుతుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది. ముందుగా క్యాప్డ్ ప్లేయర్ల వేలం నిర్వహిస్తారు. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ప్లేయర్ల బిడ్డింగ్ ఉంటుంది.
IPL 2026 Auction
Quinton de Kock
IPL 2026
IPL Auction
Indian Premier League
BCCI
Travis Mathew
Wanindu Hasaranga
Cricket Auction
T20 Cricket
Abu Dhabi

More Telugu News