Pawan Kalyan: పీఆర్, ఆర్డీ ఉద్యోగులతో రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Pawan Kalyan to Meet PR RD Employees Tomorrow
  • మంగళగిరిలో 'మాటామంతీ' కార్యక్రమం ఏర్పాటు
  • అవినీతి రహిత పాలనపై ఉద్యోగులకు దిశానిర్దేశం 
  • గ్రామీణ సేవల మెరుగుకు సలహాలు స్వీకరించనున్న పవన్
ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉద్యోగులతో నేరుగా చర్చించేందుకు సిద్ధమయ్యారు. రేపు (బుధవారం) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్‌ (పీఆర్), గ్రామీణాభివృద్ధి (ఆర్డీ) శాఖల ఉద్యోగులతో 'మాటామంతీ' కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో అవినీతికి తావులేని, పారదర్శకమైన పాలన అందించేందుకు ఉద్యోగులంతా సహకరించాలని ఈ సమావేశంలో ఆయన కోరనున్నారు.
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్‌ శాఖలో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, గ్రామీణాభివృద్ధి శాఖలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం పదోన్నతులు, వేతనాల పెంపుతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నూతన సంవత్సర కానుకగా సంక్రాంతి నాటికి ఈ ప్రయోజనాలను వారికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో అన్ని కేడర్ల ఉద్యోగులతో పవన్ స్వయంగా మాట్లాడి, గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎలాంటి విధానాలు అవలంబించాలనే దానిపై వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 
Pawan Kalyan
Andhra Pradesh
Panchayat Raj
Rural Development
AP Deputy CM
CK Convention
Employee Meeting
Government Schemes
Village Administration
AP Politics

More Telugu News