Asim Munir: ఈసారి మా స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది.. భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

Asim Munir Warns India of Strong Response
  • పాకిస్థాన్ త్రివిధ దళాల సమన్వయానికి డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు
  • మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సైన్యంలో మార్పులు
  • ఆర్మీ చీఫ్‌తో పాటు సీడీఎఫ్ పదవిలోనూ కొనసాగనున్న మునీర్
పాకిస్థాన్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్)‌గా నియమితులైన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో భారత్ దూకుడుగా వ్యవహరిస్తే, ఇస్లామాబాద్ స్పందన మరింత 'వేగంగా, తీవ్రంగా, బలంగా' ఉంటుందని స్పష్టం చేశారు. "భారత్ ఎలాంటి భ్రమల్లోను ఉండకూడదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ ఒక 'చారిత్రాత్మక' నిర్ణయమని మునీర్ అభివర్ణించారు. ఆర్మీ, వైమానిక, నౌకాదళాల ఏకీకృత వ్యవస్థ ద్వారా బహుళ క్షేత్రాల్లో కార్యకలాపాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని వివరించారు. ఈ వివరాలను పాకిస్థానీ న్యూస్ చానల్ జియో న్యూస్ తన కథనంలో వెల్లడించింది.

మారుతున్న, పెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవాలంటే త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ హెడ్‌క్వార్టర్స్ త్రివిధ దళాల కార్యకలాపాలను సమన్వయం చేస్తుందని, ఉన్నత స్థాయి నాయకత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తూనే ఆయా దళాలు తమ స్వయంప్రతిపత్తిని, సంస్థాగత నిర్మాణాన్ని కొనసాగిస్తాయని తెలిపారు.

ఆధునిక యుద్ధ తంత్రం స్వరూపం మారిపోయిందని మునీర్ అన్నారు. యుద్ధాలు ఇప్పుడు సైబర్‌స్పేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, అంతరిక్షం, ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలకు విస్తరించాయని, వీటికి అనుగుణంగా సాయుధ దళాలు మారాల్సి ఉందని చెప్పారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ ప్రజలు, సైన్యం చూపిన పోరాటపటిమ భవిష్యత్ ఘర్షణలకు ఒక 'కేస్ స్టడీ' అని ఆయన ప్రశంసించారు.

'ఆపరేషన్ సిందూర్'లో భారత సైన్యం చేతిలో పాకిస్థాన్ భద్రతా దళాలు భారీ నష్టాలను చవిచూసిన తర్వాత మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. ఆరు దశాబ్దాల తర్వాత ఈ హోదా పొందిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు. పాకిస్థాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ (సవరణ) బిల్లులు 2025కు అధ్యక్షుడు జర్దారీ ఆమోదం తెలిపిన తర్వాత ఈ సీడీఎఫ్ పోస్టును సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ చీఫ్‌గా తన ఐదేళ్ల పదవీకాలంతో పాటు సీడీఎఫ్ పదవిలోనూ కొనసాగుతారు.
Asim Munir
Pakistan
India
Pakistan Army
chief of defence staff
Geo News
Operation Sindoor
cyber warfare
military
field marshal

More Telugu News