సీఎం రేవంత్ కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

  • హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై పేలిన‌ జామర్ వాహనం టైర్ 
  • డ్రైవర్ అప్రమత్తతతో త‌ప్పిన‌ పెను ప్రమాదం 
  • గతంలోనూ రేవంత్ కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది.

ఈ ఘటనతో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్‌లోని వాహనాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు.


More Telugu News