Paidikondala Durga Rao: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం

Paidikondala Durga Rao Dies in Prakasham District Lorry Accident
  • ప్రకాశం జిల్లా బెస్తవారిపేట వద్ద ఘటన 
  • టైరు పేలడంతో ఎదురెదురుగా లారీలు ఢీకొన్న వైనం 
  • క్యాబిన్‌లో చిక్కుకుని సజీవ దహనమైన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్
  • మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా గుర్తింపు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయి మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే, అనంతపురం నుంచి టమాటా లోడ్‌తో రాజమండ్రికి వెళ్తున్న లారీ పెంచికలపాడు వద్దకు రాగానే టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీనితో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టమాటా లారీ బోల్తా పడగా, ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పైడికొండల దుర్గారావు (40) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ఆ వెంటనే లారీలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో అతను అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మృతుడిని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వాసిగా గుర్తించారు. విశాఖ సమీపంలోని పరవాడ నుంచి చమురు లోడ్ చేసుకుని తాడిపత్రిలోని ఒక సిమెంట్ పరిశ్రమకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.

సమాచారం అందుకున్న గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Paidikondala Durga Rao
Prakasham district
road accident
lorry accident
truck collision
Andhra Pradesh
fire accident
oil tanker
tomato lorry
Bestavaripeta

More Telugu News