Chandrababu Naidu: సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే: చంద్రబాబు

Chandrababu Naidu All Government Services Online by Sankranti
  • ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు
  • ఆర్టీసీ సేవలు మెరుగుపరచాలని, డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్దేశం
  • రిజిస్ట్రేషన్ పత్రాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపేలా చర్యలు
  • 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్'పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన
వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పారదర్శక పాలన అందించడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం నిర్దేశించారు. ఇందుకు 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్'ను సమర్థంగా వినియోగించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతి మార్చుకుని ఆన్‌లైన్‌ బాట పట్టాలని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా పలు శాఖలకు ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లలో, ముఖ్యంగా టాయిలెట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతుందని, వాటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు డ్రోన్లను ఎలా ఉపయోగించవచ్చో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

కొన్ని జిల్లాల్లో అధికారులు అమలు చేస్తున్న మంచి విధానాలను గుర్తించి, వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Government Services
Online Services
RTGS
Real Time Governance Society
Mana Mitra WhatsApp Governance
AP Government
Digital Governance
Vijay Anand

More Telugu News