Indigo Airlines: డీజీసీఏ నోటీసులపై ఇండిగో స్పందన

Indigo Airlines Responds to DGCA Notice on Flight Disruptions
  • ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు
  • విమానాల రద్దుకు ప్రాథమికంగా ఐదు కారణాలు వెల్లడి
  • పూర్తి స్థాయి విశ్లేషణకు మరింత సమయం కావాలని వినతి
విమాన సర్వీసుల అంతరాయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. ఈ గందరగోళానికి దారితీసిన పూర్తి స్థాయి కారణాలను విశ్లేషించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరింది. ఈ మేరకు సంస్థ సీఈవో, సీఓఓల సంతకాలతో కూడిన వివరణను డీజీసీఏకు సమర్పించింది.
 
డిసెంబర్ ఆరంభంలో తమ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగడానికి ప్రాథమికంగా ఐదు అంశాలు కారణమని ఇండిగో తన నివేదికలో పేర్కొంది. స్వల్ప సాంకేతిక సమస్యలు, విమానాల షెడ్యూళ్లలో మార్పులు, ప్రతికూల వాతావరణం, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ వంటివి తమ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపాయని వివరించింది. వీటికి తోడు కొత్తగా అమల్లోకి వచ్చిన 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) ఫేజ్ II' నిబంధనలు కూడా ఇబ్బందులకు ఒక కారణమని తెలిపింది.
 
ఈ కారణాలన్నీ కలిసి తమ ఆన్-టైమ్ పనితీరును దెబ్బతీశాయని ఇండిగో పేర్కొంది. దీంతో నెట్‌వర్క్‌ను పునరుద్ధరించి, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 'నెట్‌వర్క్ రీబూట్' లాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఫలితంగా పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని వివరించింది. ప్రస్తుతం పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నందున, పూర్తి స్థాయి 'రూట్ కాజ్ అనాలిసిస్' (ఆర్‌సీఏ)చేయడానికి డీజీసీఏ నిబంధనల ప్రకారం 15 రోజుల గడువు ఇవ్వాలని కోరింది. విచారణ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదిక సమర్పిస్తామని హామీ ఇచ్చింది.
Indigo Airlines
DGCA
flight disruptions
aviation
flight delays
India
air travel
technical issues
weather conditions
flight schedules

More Telugu News