నెల్లూరులో బస్ డ్రైవర్, కండక్టర్ పై బ్లేడ్లతో దాడి... నిందితులతో పరేడ్ చేయించిన పోలీసులు

  • నెల్లూరులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై కత్తులతో దాడి
  • బైక్ పక్కకు తీయమన్నందుకు దుండగుల ఘాతుకం
  • నిందితులను అరెస్ట్ చేసి నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
  • నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ 
నెల్లూరు నగరంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం వారికి వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. నిందితులను నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు నడిరోడ్డుపై నడిపించారు. నేరాలకు పాల్పడితే ఎంతటివారికైనా ఇదే గతి పడుతుందని పోలీసులు హెచ్చరించారు.
 
జిల్లా ఎస్పీ అజిత వెజండ్ల మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. పిల్లలు తప్పుదోవ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
 
అసలేం జరిగిందంటే.. ఆదివారం నెల్లూరు నక్కలోళ్ల సెంటర్ వద్ద కొందరు యువకులు తమ బైక్‌ను రోడ్డుకు అడ్డంగా పార్క్ చేశారు. దానిని పక్కకు తీయాలని సిటీ బస్సు డ్రైవర్ మన్సూర్, కండక్టర్ సలీమ్ సూచించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు మారణాయుధాలతో వారిపై దాడి చేశారు. డ్రైవర్ మన్సూర్ గొంతు కోయగా, కండక్టర్ సలీమ్‌ను తీవ్రంగా గాయపరిచారు.
 
ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ సిబ్బందిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సంతపేట పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News