Indigo: ఇండిగో సంక్షోభం... ఎయిరిండియా ఉద్యోగ ప్రకటన

Air India Announces Pilot Recruitment Amid Indigo Crisis
  • పైలట్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎయిరిండియా
  • ఆకాశం హద్దు, ఇది ప్రారంభం మాత్రమే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు
  • డిసెంబర్ 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన
ఇండిగో సంక్షోభం సమయంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. పైలట్ల నియామకాలకు ప్రకటన జారీ చేసింది. విమానయాన అంతరాయాలు, సర్వీసుల రద్దు, ఆలస్యాల కారణంగా పౌర విమానయాన రంగంలో గందరగోళం నెలకొన్న విషయం విదితమే. తగినంత మంది పైలట్లు, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎయిరిండియా పైలట్ల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. "ఆకాశమే హద్దు, ఇది ఆరంభం మాత్రమే" అంటూ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఈ ప్రకటన చేసింది.

భారత విమానయాన రంగం భవిష్యత్తును నిర్దేశించే వారిగా మారాలని, విమానాల సంఖ్యను పెంచుతున్నందున అనుభవజ్ఞులైన బీ737, ఏ320 పైలట్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొంది. డిసెంబర్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎయిరిండియా ప్రతి విమానాన్ని 5.4 మంది పైలట్లతో నిర్వహిస్తోంది. ఇండిగో 2.5 మందితో పోలిస్తే ఇది రెట్టింపుగా ఉంది.

ఇండిగో కూడా 2026 చివరినాటికి 900 మంది పైలట్లను నియమించుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి 158 మందిని, 2026 డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్లను నియమించుకుంటామని ప్రభుత్వానికి తెలియజేసింది. రానున్న 12 నెలల్లో 300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లను నియమించుకుంటామని కూడా తెలిపింది.
Indigo
Indigo crisis
Air India
Air India pilots recruitment
pilot jobs
aviation sector

More Telugu News