రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి: తమ్మినేని సీతారాం

  • విమానయాన సంక్షోభంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌పై తమ్మినేని విమర్శలు
  • రామ్మోహన్ అసమర్థత వల్లే విమాన సర్వీసులు కుప్పకూలాయని విమర్శ
  • దేశం పరువు పోయిందని మండిపాటు
ఇటీవల తలెత్తిన ఇండిగో విమానయాన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన అసమర్థత వల్లే దేశంలో విమాన సర్వీసులు కుప్పకూలాయని, అంతర్జాతీయంగా దేశ పరువు పోయిందని ఆరోపిస్తూ, మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రామ్మోహన్ నాయుడి వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ్యాయని ఆరోపించారు. "మంత్రి ముందస్తు సమన్వయం, సమీక్షలు చేయకపోవడం వల్లే ఇండిగో వంటి సంస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. సమస్యపై స్పందించకుండా మీడియాకు ముఖం చాటేయడం సరికాదు" అని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, ఆముదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ మరింత ఘాటుగా స్పందించారు. రామ్మోహన్ నాయుడును 'రీల్స్ మంత్రి'గా అభివర్ణించారు. "కారెక్కినప్పుడు, దిగినప్పుడు రీల్స్ చేయడంపై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అహ్మదాబాద్‌లో విమానం కూలి 241 మంది మరణిస్తే, అక్కడికి కూడా వెళ్లి రీల్స్ చేస్తారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రమంత్రిగా, ఎంపీగా శ్రీకాకుళం జిల్లాకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని గెలిపించినందుకు జిల్లా ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు" అని రవికుమార్ అన్నారు. 


More Telugu News