కావాలనే అలా బౌలింగ్ చేశా.. షకీబల్ హసన్ సంచలన వ్యాఖ్యలు

  • అలసట వల్లే కావాలని బౌలింగ్ యాక్షన్ మార్చానన్న షకీబ్
  • ఒకే కౌంటీ మ్యాచ్‌లో 70 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడమే కారణమని వెల్లడి
  • అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించానన్న షకీబ్
  • యాక్షన్ సరిదిద్దుకున్నా చాంపియన్స్ ట్రోఫీకి దూరం
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ తన బౌలింగ్ యాక్షన్‌పై పడిన నిషేధం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. గతేడాది కౌంటీ క్రికెట్‌లో అక్రమ బౌలింగ్ యాక్షన్ కారణంగా నిషేధానికి గురైన తాను, తీవ్రమైన అలసట వల్ల ఉద్దేశపూర్వకంగానే అలా బౌలింగ్ చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు.

'బియర్డ్ బిఫోర్ వికెట్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ షకీబ్ ఈ విషయాలు తెలిపాడు. "ఆ సమయంలో నేను కావాలనే నా యాక్షన్‌ను కొద్దిగా మార్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకే మ్యాచ్‌లో 70 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాను. నా కెరీర్‌లో ఏ టెస్టు మ్యాచ్‌లోనూ అన్ని ఓవర్లు వేయలేదు. పాకిస్థాన్‌లో వరుసగా టెస్టులు ఆడి, నేరుగా ఆ నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ ఆడాను. దాంతో పూర్తిగా అలసిపోయాను" అని వివరించాడు.

గతేడాది సర్రే తరఫున ఆడుతున్నప్పుడు సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 63.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతడి యాక్షన్‌పై అనుమానం రావడంతో అంపైర్లు రిపోర్ట్ చేశారు. దీనిపై స్పందిస్తూ "నిబంధనల ప్రకారం వాళ్లు చేసింది సరైందే. నేను ఫిర్యాదు చేయలేదు" అని చెప్పాడు.

లాఫ్‌బరో యూనివర్సిటీలో జరిగిన పరిశీలనలో అతని యాక్షన్ అక్రమమని తేలడంతో ఈసీబీ, ఐసీసీ అతడిపై నిషేధం విధించాయి. యూకే, చెన్నైలలో జరిగిన పరీక్షల్లో విఫలమైన తర్వాత, సర్రే కోచ్‌ల సహాయంతో తన యాక్షన్‌ను సరిదిద్దుకున్నాడు. మూడోసారి జరిగిన పరీక్షలో పాస్ అవ్వడంతో ఈ ఏడాది ఆరంభంలో తిరిగి బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.

అయితే, బౌలింగ్ చేసేందుకు అనుమతి వచ్చినా, ఈ నిషేధం ప్రభావం అతని కెరీర్‌పై పడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతడిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అందుబాటులో ఉన్నప్పటికీ జట్టులో స్థానం కల్పించకపోవడం గమనార్హం.


More Telugu News