Humayun Kabir: ఒవైసీతో చేతులు కలుపుతున్న టీఎంసీ బహిష్కృత నేత

Humayun Kabir to Join Hands with Owaisi After TMC Suspension
  • 22న కొత్త పార్టీని ప్రకటించనున్న హుమాయున్ కబీర్
  • ఎంఐఎంతో పొత్తు ఖాయమని వెల్లడి
  • టీఎంసీ, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కూటమి ఏర్పాటు ప్రయత్నాలు
  • సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్‌ పార్టీలను కూటమిలోకి ఆహ్వానించిన కబీర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్ నేత హుమాయున్ కబీర్ సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 22న తన పార్టీ పేరును వెల్లడిస్తానని, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు స్పష్టం చేశారు.

"డిసెంబర్ 22న నా కొత్త పార్టీ పేరును ప్రకటిస్తాను. మా పార్టీ ఒవైసీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుంది. ఇప్పటికే నేను ఒవైసీ సాబ్‌తో చర్చించాను. తదుపరి చర్చల కోసం నన్ను హైదరాబాద్ రమ్మని ఆయన ఆహ్వానించారు" అని కబీర్ తెలిపారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని, కేంద్రంలోని బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుందని ఆయన అన్నారు.

ఏఐఎంఐఎంతో పొత్తు ఖాయమైందని చెబుతూనే.. సీపీఎం, కాంగ్రెస్, నౌషద్ సిద్ధిఖీకి చెందిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)పార్టీలను కూడా తమ కూటమిలోకి రావాలని కబీర్ ఆహ్వానించారు. "పశ్చిమ బెంగాల్‌లో మా లక్ష్యం 135 సీట్లు. కూటమి అధికారికంగా ఏర్పడ్డాక సీట్ల పంపకాలపై చర్చిస్తాం" అని ఆయన వివరించారు. ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మరుసటి రోజే కబీర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

అయితే, కబీర్ ప్రతిపాదనపై సీపీఎం వర్గాలు తీవ్రంగా స్పందించాయి. హుమాయున్ కబీర్ బీజేపీ ఏజెంట్ అని, ఆయనతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నట్లు సమాచారం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎస్ఎఫ్‌తో కలిసి పోటీ చేసిన సీపీఎం కూటమి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
Humayun Kabir
AIMIM
Asaduddin Owaisi
Trinamool Congress
TMC
West Bengal Politics
Political Alliance
Indian Secular Front
CPM
Congress

More Telugu News