Indigo Crisis: ఇండిగోకు డీజీసీఏ సీరియస్ వార్నింగ్.. 24 గంటల్లో వివరణకు ఆదేశం

DGCA gives 24 hours to IndiGo CEO to explain what led to mega fiasco at airline
  • ఇండిగో విమానాల రద్దుపై సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీసు
  • 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పీటర్ ఎల్బర్స్‌కు ఆదేశం
  • ప్రణాళిక, నిర్వహణలో లోపాలే కారణమని డీజీసీఏ ఆగ్రహం
  • విచారణకు కమిటీ వేశామని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
  • విమాన టికెట్ల ధరలపై దేశవ్యాప్తంగా పరిమితి విధించిన కేంద్రం
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో నెలకొన్న తీవ్ర అంతరాయాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంస్థ యాజమాన్యాన్నే బాధ్యులను చేస్తూ.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈరోజు కూడా పలు ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ రంగంలోకి దిగింది. సంస్థ ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని నోటీసులో పేర్కొంది. పైలట్ల ఫెటీగ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైందని స్పష్టం చేసింది. "సంస్థ సీఈవోగా నమ్మకమైన కార్యకలాపాలు నిర్వహించడంలో, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారు" అని డీజీసీఏ ఆ నోటీసులో తీవ్రంగా వ్యాఖ్యానించింది.

విచారణ అనంతరం కఠిన చర్యలు: మంత్రి రామ్మోహన్ నాయుడు 
మరోవైపు ఈ సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇండిగో వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతున్నామని, ఇందుకోసం నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. విచారణ అనంతరం అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల‌ 10 నుంచి 15వ తేదీ మధ్య పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నట్లు ఇండిగో సీఈవో ఇటీవల ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

విమాన టికెట్ల ధరలపై కేంద్రం పరిమితి 
ప్రయాణికులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడంతో.. దేశీయ విమాన ఛార్జీలపై పరిమితి విధించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టికెట్ ధర గరిష్ఠంగా రూ. 7,500 నుంచి రూ. 18,000 మధ్య ఉండేలా నిబంధనలు విధించింది.
Indigo Crisis
Peter Elbers
Indigo
DGCA
Ram Mohan Naidu
flight cancellations
airline crisis
aviation ministry
ticket prices
civil aviation
India

More Telugu News