ఖర్జూర గింజ వ్యక్తి ప్రాణం తీసింది!

  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఖర్జూరం తింటూ వ్యక్తి మృతి
  • గొంతులో ఇరుక్కున్న గింజ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఘటన
  • మృతుడిని పెనుకొండకు చెందిన 46 ఏళ్ల గంగాధర్‌గా గుర్తింపు
  • ఆసుప‌త్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి
ఓ చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలిగొంది. ఖర్జూరం తింటుండగా దాని గింజ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెనుకొండకు చెందిన గంగాధర్ (46) కార్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూర పండ్లు తింటుండగా, ప్రమాదవశాత్తు ఓ గింజ గొంతులో ఇరుక్కుంది. అది శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో గంగాధర్‌కు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.

కుటుంబసభ్యులు వెంటనే అతడిని పెనుకొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా అనంతపురంలోని పెద్ద ఆసుప‌త్రికి తరలించాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు అతడిని అనంతపురానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గంగాధర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.




More Telugu News