'ఎస్ఐఆర్'లో తప్పుడు వివరాలు.. దేశంలోనే ఉత్తరప్రదేశ్‌లో తొలి కేసు నమోదు

  • సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు
  • బీఎన్ఎస్ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద ఎఫ్ఐఆర్ నమోదు
  • రాంపూర్ నివాసితులు నూర్జహాన్, ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓటరు జాబితా నవీకరణ (ఎస్ఐఆర్) సమయంలో సమర్పించిన ఫారమ్‌లలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక కుటుంబంపై మొట్టమొదటిసారిగా కేసు నమోదు చేశారు. రాంపూర్‌కు చెందిన ఒక సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు, బీఎన్ఎస్ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. రాంపూర్ నివాసితురాలైన నూర్జహాన్, ఆమె ఇద్దరు కుమారులు అమీర్ ఖాన్, డానిష్ ఖాన్‌ చాలాకాలంగా దుబాయ్, కువైట్‌లలో నివసిస్తున్నారు.

ఓటరు జాబితా నవీకరణ కోసం చేపట్టిన ఫారమ్‌లో నూర్జహాన్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమె తన కుమారులు రాంపూర్‌లోనే నివసిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఫోర్జరీ చేసిన సంతకాలు కలిగిన పత్రాలను బూత్‌ స్థాయి అధికారికి సమర్పించింది.

ఎస్ఐఆర్ వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్న సమయంలో నూర్జహాన్ ఇచ్చిన సమాచారం తప్పు అని అధికారులు గుర్తించారు. ఆమె తన కుమారుల సంతకాలను ఫోర్జరీ చేసిందని కూడా గ్రహించారు. ఈ నేపథ్యంలో నూర్జహాన్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'ఎస్ఐఆర్' ప్రక్రియలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసు నమోదు కావడం దేశంలోనే ఇది మొదటిసారి.


More Telugu News