Pragathi: టర్కీలో పవర్ లిఫ్టింగ్ టోర్నీ... డెడ్‌లిఫ్ట్‌లో పసిడి మోత మోగించిన ప్రగతి

Pragathi Wins Gold in Asian Powerlifting Championship Turkey
  • టర్కీలో జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నటి ప్రగతి సత్తా
  • డెడ్‌లిఫ్ట్‌లో స్వర్ణం సహా మొత్తం నాలుగు పతకాలు కైవసం
  • 49 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన
  • క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే ఫిట్‌నెస్‌లో యువతకు స్ఫూర్తి
  • ప్రగతి విజయంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి, అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తా చాటారు. 49 ఏళ్ల వయసులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. డెడ్‌లిఫ్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె విజయంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

టర్కీలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో మాస్టర్స్ కేటగిరీలో పోటీపడిన ప్రగతి, తన కఠోర శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. డెడ్‌లిఫ్ట్‌లో స్వర్ణం, ఓవరాల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం, బెంచ్ ప్రెస్, స్క్వాట్ లిఫ్ట్ విభాగాల్లోనూ రజత పతకాలు సాధించి సత్తా చాటారు. ఈ విజయానందాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినీ రంగంలో సహాయ నటిగా రాణిస్తున్న ప్రగతి, కొన్నేళ్లుగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. 2023 నుంచి పోటీల్లో పాల్గొంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. హైదరాబాద్, తెలంగాణ, ఏపీ స్థాయి పోటీల్లోనూ వరుస విజయాలు నమోదు చేశారు. ఈ విజయాలే ఆమెను అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేలా చేశాయి. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, ఎంతో మంది మహిళలకు ప్రగతి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Pragathi
Pragathi actress
powerlifting
Asian Powerlifting Championship
Turkey
deadlift
Telugu actress
fitness
sports
Hyderabad

More Telugu News