పాక్ పార్లమెంటులో గాడిద... వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

  • పాకిస్థాన్ పార్లమెంటులో గాడిద తిరుగుతున్న వీడియో వైరల్
  • ఇది నిజం కాదని ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడి
  • ఏఐ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ వీడియోగా నిర్ధారణ
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ పార్లమెంటులో ఓ గాడిద పరిగెత్తి కొందరు ఎంపీలను డీకొట్ట‌డం ఆ వీడియోలో కనిపిస్తుంది. ‘పాకిస్థాన్ పార్లమెంటులోకి గాడిద ప్రవేశించి హల్‌చల్ సృష్టించింది’ అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్‌తో పాటు ఇతర మాధ్యమాల్లోనూ ఈ వీడియో బాగా షేర్ అవుతోంది.

అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో స్పష్టమైంది. వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమైంది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన నకిలీ వీడియో అని తేలింది.

పాకిస్థాన్ పార్లమెంటులో ఇలాంటి ఘటన జరిగినట్లుగా ఎలాంటి అధికారిక రికార్డులు గానీ, విశ్వసనీయ వార్తా కథనాలు గానీ అందుబాటులో లేవు. దీంతో ఈ ఘటన నిజంగా జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు అందులో చాలా లోపాలు కనిపించాయి. గాడిద కదలికలు చాలా అసహజంగా ఉన్నాయి. నేలపై దాని గిట్టల ప్రభావం, సరైన నీడలు కూడా కనిపించలేదు. కొన్ని ఫ్రేముల్లో గాడిద బొమ్మ చుట్టూ ఉన్న వస్తువులతో సరిగ్గా సింక్ కాకపోవడం వంటివి ఏఐ వీడియోలలో కనిపించే సాధారణ లోపాలు.

ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈ క్లిప్‌ను ‘హైవ్ మాడరేషన్’, ‘డీప్‌ఫేక్-ఓ-మీటర్’ వంటి టూల్స్‌తో విశ్లేషించ‌గా.. ఇది ఏఐ సృష్టించిన వీడియోనే అని నిర్ధారించాయి. దాంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టమవుతోంది.


More Telugu News