చరిత్రలో ఎన్నడూలేని రీతిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 'ఆపరేషన్ కవచ్': సజ్జనార్

  • ఆపరేషన్ కవచ్ పేరుతో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెల్లడి
  • రాత్రి 10 గంటల నుంచి నాకాబందీ నిర్వహిస్తున్నామన్న సజ్జనార్
  • 5,000 మంది పోలీసు సిబ్బందితో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు
హైదరాబాద్ నగరంలో 'ఆపరేషన్ కవచ్' పేరుతో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కమిషనరేట్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు.

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేసే దిశగా, రాత్రి 10 గంటల నుంచి 'ఆపరేషన్ కవచ్' పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలోనే మొదటిసారి దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామన్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నట్లు చెప్పారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


More Telugu News