Asim Munir: ఆసిమ్ మునీర్ ను అరెస్టు చేయాల్సింది.. పెంటగాన్ మాజీ అధికారి వ్యాఖ్య

Former Pentagon Official Slams US Pakistan Policy
  • ఆసిమ్ మునీర్ కు ట్రంప్ ఆతిథ్యంపై మండిపడ్డ మైఖేల్ రూబిన్
  • పాకిస్థాన్ తో అమెరికా బంధాన్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు
  • వెంటనే పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్
  • సుంకాల విషయంలో భారత్ కు క్షమాపణ చెప్పాలన్న రూబిన్
పాకిస్థాన్ తో అమెరికా సంబంధాలపై పెంటగాన్ (అమెరికా రక్షణ వ్యవహారాల కేంద్రం) మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత జులైలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసంలో ఆతిథ్యం ఇవ్వడాన్ని రూబిన్ తప్పుబట్టారు. పదే పదే అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశంతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు.

పాకిస్థాన్ ను వెంటనే ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసిమ్ మునీర్ కు ఆతిథ్యం ఇవ్వడం కాదు.. అరెస్టు చేసి ఉండాల్సిందని రూబిన్ పేర్కొన్నారు. దౌత్యపరంగా చూసినా పాకిస్థాన్ పెద్దగా ప్రభావవంతమైన దేశం కూడా కాదని చెప్పారు. ఈ క్రమంలో పాకిస్థాన్ తో స్నేహం వల్ల అమెరికాకు నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగంలేదన్నారు.

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంగా భారత్ పై అమెరికా విధించిన అదనపు సుంకాలనూ రూబిన్ తప్పుబట్టారు. ఈ విషయంలో భారత్ కు అమెరికా క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఇష్టపడకపోవచ్చు కానీ, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్ తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాల్సిందేనని అభిప్రాయపడ్డారు. భారత్‌ కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలకు రాజకీయ సహకారం అందించడం వలన ఆసియా ప్రాంతంలో అమెరికా విశ్వసనీయత కోల్పోతుందని రూబిన్ హెచ్చరించారు.
Asim Munir
Michael Rubin
Pakistan
Pentagon
Terrorism
Donald Trump
Shahbaz Sharif
US relations
India
Oil imports

More Telugu News