విశాఖలో సిరీస్ నిర్ణయాత్మక పోరు.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లీ

  • విశాఖ వేదిక‌గా నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వ‌న్డే 
  • భారీ ఒత్తిడిలో కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ గంభీర్
  • అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఆశలు
  • 28,000 పరుగుల మైలురాయికి 90 పరుగుల దూరంలో కోహ్లీ
  • సంగక్కర రికార్డును బద్దలు కొట్టేందుకు 107 ర‌న్స్‌ అవసరం
భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఇవాళ‌ జరగనున్న మూడో వన్డే ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టెంబా బవుమా సారథ్యంలోని సఫారీ జట్టు, వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు వరుసగా రెండో వన్డే సిరీస్ ఓటమిని తప్పించుకోవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. దీంతో తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

ఈ కీలక మ్యాచ్‌లో అందరి కళ్లూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. సిరీస్‌లోని తొలి రెండు వన్డేల్లోనూ వరుస సెంచరీలు బాదిన కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విశాఖ మైదానంలో కూడా అతనికి మెరుగైన రికార్డు ఉండటంతో అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రెండు భారీ మైలురాళ్లను అందుకునే అవకాశం ఉంది.

కోహ్లీ మరో 90 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఒకవేళ 107 పరుగులు సాధిస్తే, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.




More Telugu News