కార్పొరేట్ వర్సిటీలకు దీటుగా ఉస్మానియా.. రూ.1000 కోట్లతో అభివృద్ధి

  • అంతర్జాతీయ ప్రమాణాలతో ఓయూ రూపురేఖల మార్పునకు ప్రణాళిక
  • అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • డిజైన్లపై విద్యార్థులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యత
  • ఈ నెల‌ 10న ఓయూను సందర్శించనున్న ముఖ్యమంత్రి 
చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేట్ వర్సిటీలకు దీటుగా, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఓయూను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్లకు పైగా వెచ్చించాలని నిర్ణయించింది. ఈ బృహత్ ప్రణాళిక అమలుపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ ప్రణాళికలో భాగంగా వర్సిటీలో ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రాలు, మెగా హాస్టళ్లు, హైటెక్ అకడమిక్ బ్లాకులు నిర్మించనున్నారు. వీటితో పాటు సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు, క్రీడా సదుపాయాలు, హెల్త్ కేర్ సెంటర్, కన్వెన్షన్ హాల్ వంటి ఆధునిక హంగులను కల్పించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పటివరకు సిద్ధం చేసిన డిజైన్ నమూనాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, వారి సలహాలు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓయూ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిహ్నాలు ఏర్పాటు చేయాలన్నారు.

వర్సిటీలోని చారిత్రక, వారసత్వ కట్టడాలను సంరక్షించాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఓయూ అభివృద్ధికి ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పనుల పురోగతిని సమీక్షించేందుకు ఈ నెల‌10న తాను ఓయూను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


More Telugu News