పాన్ మసాలా బ్రాండ్లకు ప్రచారం చేసే నటుల నుంచి అవార్డులు వెనక్కి తీసుకోవాలి: ఎంపీ హనుమాన్ బేనివాల్

  • షారుఖ్, అజయ్ దేవగణ్ వంటి నటులపై లోక్‌సభలో ఎంపీ హనుమాన్ బెనివాల్ ఫైర్
  • పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్న హీరోల జాతీయ అవార్డులు రద్దు చేయాలని డిమాండ్
  • గుట్కా, పాన్ మసాలా వల్ల దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన
పాన్ మసాలా, గుట్కా వంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న సినీ నటుల జాతీయ అవార్డులను వెనక్కి తీసుకోవాలని జాతీయ ప్రజాస్వామ్య పార్టీ అధ్యక్షుడు, రాజస్థాన్ లోని నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేశారు. లోక్‌సభలో 'జాతీయ భద్రత, ప్రజారోగ్య సెస్ బిల్లు'పై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలాను షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ నటులు ప్రచారం చేస్తున్నారని బెనివాల్ ఆరోపించారు. "జాతీయ అవార్డులు పొందిన ఏ వ్యక్తి కూడా ఇలాంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయకూడదు. ఒకవేళ వారికి అవార్డులు ఇచ్చి ఉంటే, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి" అని ఆయన అన్నారు. ఈ నటులపై తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులు రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌తో పాటు జైపూర్, జోధ్‌పూర్ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.

దేశంలో గుట్కా, పాన్ మసాలా వినియోగం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో వీటి వాడకం విచ్చలవిడిగా సాగుతోందని విమర్శించారు. రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కొందరు అధికారుల అండతో అక్రమ గుట్కా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.

అనంతరం, రూల్ 377 కింద ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ అంశాన్ని కూడా బెనివాల్ లేవనెత్తారు. అక్రమ మైనింగ్, ఆక్రమణల కారణంగా ఆరావళి పర్యావరణ వ్యవస్థ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాజస్థాన్‌లో 27,000కు పైగా అక్రమ మైనింగ్ కేసులు నమోదైనా, కేవలం 13 శాతం కేసుల్లోనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. ఆరావళి పర్వతాల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక జాతీయ విధానాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News