పాన్ మసాలాపై కొత్త సెస్సు.. బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు
  • జాతీయ భద్రత, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగించాలని నిర్ణయం
  • సెస్సును రాష్ట్రాలతో కలిసి పంచుకుంటామని వెల్లడి
పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధిస్తూ, తద్వారా వచ్చే నిధులను జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించాలని ప్రతిపాదించే 'హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు-2025'ను లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. పాన్ మసాలా కంపెనీలపై సెస్సును ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ, ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, సెస్సు ద్వారా వచ్చే నిధులను రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ సెస్సు ద్వారా సమకూరిన నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.

పాన్ మసాలా, ఈ తరహా ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లకు ఈ సెస్సు వర్తిస్తుంది. జాతీయ ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి అంశాలకు ఈ నిధులను వినియోగిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం పాన్ మసాలాపై జీఎస్టీ గరిష్ఠ శ్లాబు అయిన 40 శాతం విధిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ సెస్సు వల్ల జీఎస్టీ రాబడిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. తయారీ సామర్థ్యం ఆధారంగా ఈ సెస్సును విధిస్తామని పేర్కొన్నారు. 2010-14 మధ్య సెస్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 7 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 6.1 శాతానికి తగ్గినట్లు ఆమె వెల్లడించారు.


More Telugu News