టికెట్లకు పూర్తి రిఫండ్, ప్రయాణికులకు హోటల్ వసతి.. ఇండిగో సంస్థకు కేంద్రం కీలక ఆదేశాలు

  • ఇండిగో సర్వీసుల అంతరాయంపై ఉన్నత స్థాయి విచారణ
  • రద్దయిన టికెట్లకు పూర్తి వాపసు ఇవ్వాలని ఎయిర్‌లైన్స్‌కు ఆదేశం
  • మూడు రోజుల్లో సర్వీసులు సాధారణ స్థితికి వస్తాయని మంత్రి హామీ
  • పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో భారీ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ గందరగోళంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అసలు సమస్య ఎక్కడ తలెత్తింది, దీనికి బాధ్యులు ఎవరు అనే అంశాలను తేల్చడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలను సూచించాలని కమిటీని ఆదేశించింది.

ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, శనివారం నాటికి విమాన సర్వీసుల షెడ్యూళ్లు కుదుటపడతాయని ఆశిస్తున్నామని, రాబోయే మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరణ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రయాణికులు తమ ఇళ్ల నుంచే తెలుసుకునేలా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కచ్చితమైన వివరాలు అందించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించారు. ఒకవేళ విమానాలు రద్దయితే, ప్రయాణికులు దరఖాస్తు చేసుకోకుండానే టికెట్ డబ్బులను పూర్తిగా ఆటోమేటిక్‌గా రిఫండ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే విమానాలు ఆలస్యమై ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలే హోటల్ వసతి కల్పించాలని మంత్రి ఆదేశించారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన పైలట్ల విధి నిర్వహణ సమయ పరిమితుల (FDTL) ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విమాన భద్రతలో ఎలాంటి రాజీ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 24x7 కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్ల‌డించారు.


More Telugu News