హైకోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

  • నవంబర్ 27న విచారణకు హాజర కాలేకపోయినందుకు క్షమాపణ
  • వరదలు సంభవించిన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని వెల్లడి
  • బతుకమ్మ కుంట కేసు విచారణలో హైకోర్టుకు హాజరు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత నెల 27న జరిగిన విచారణకు హాజరు కాలేకపోయినందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు క్షమాపణలు తెలిపారు. తీవ్ర వరదలు సంభవించిన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చినందున విచారణకు హాజరుకాలేకపోయానని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ కుంట కేసు విచారణలో భాగంగా ఆయన ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో హైడ్రాపై ఎ. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు రంగనాథ్ కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు.

బతుకమ్మ కుంట పరిధిలోని ప్రైవేటు స్థలానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని జూన్ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన  హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అక్టోబర్ 31న దీనిని విచారించిన హైకోర్టు, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున విచారణకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రంగనాథ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం నవంబర్ 27న విచారణ చేపట్టింది.

అధికారిక విధుల కారణంగా మినహాయింపు కోరుతున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు తలచుకుంటే ధిక్కరణను ఎదుర్కొంటున్న కమిషనర్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. హాజరు మినహాయింపునకు నిరాకరిస్తూ మధ్యంతర పిటిషన్ కొట్టివేయడంతో, ఆయన ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.


More Telugu News