Universal Health Policy: ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ.. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం

Andhra Pradesh Universal Health Policy Offers Free Treatment Up To 25 Lakhs
  • యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు ప్రభుత్వం చర్యలు
  • పేద కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
  • హైబ్రిడ్ మోడ్‌లో ఎన్టీఆర్ వైద్యసేవకు టెండర్ల ఆహ్వానం
  • రాష్ట్రంలో 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి
రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' అమలుకు తొలి అడుగు పడింది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా కల్పించే ఈ పథకం కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ - ఏబీపీఎంజేఏవై పథకాన్ని హైబ్రిడ్ మోడ్‌లో అమలు చేయడానికి టెండర్లను ఆహ్వానించింది.

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం, వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉన్న నిరుపేద కుటుంబాలకు రూ. 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ మోడ్‌లో వైద్యం అందిస్తారు. ఒకవేళ వైద్య ఖర్చులు ఆ పరిమితి దాటితే, రూ. 25 లక్షల వరకు అయ్యే అదనపు ఖర్చును ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ భరిస్తుంది. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న (ఏపీఎల్) కుటుంబాలకు రూ. 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఈ పథకం అమలు కోసం టెండర్ నిబంధనలలో ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేసింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో 120 శాతం దాటితే, ప్రీమియంకు మించిన అదనపు ఖర్చును ట్రస్ట్, బీమా కంపెనీ చెరి సగం భరిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే 521 రకాల ప్రత్యేక సేవలకు అయ్యే ఖర్చును ముందుగా బీమా కంపెనీ చెల్లించి, ఆ తర్వాత ట్రస్ట్ నుంచి రీయింబర్స్‌మెంట్ పొందుతుంది.

ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్), వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్ మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని కుటుంబాలు ఈ పాలసీకి అర్హులు. ఇప్పటికే పీఎంజేఏవై, ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులు కూడా ఇందులో చేరవచ్చు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


Universal Health Policy
Andhra Pradesh Health Scheme
AP Health
NTR Vaidya Seva
ABPMJAY
Health Insurance AP
Free Medical Treatment
Healthcare AP
YS Jagan Mohan Reddy
Saurabh Gaur

More Telugu News