Akhanda 2: 'అఖండ2' విడుదల వాయిదా... అసలు కారణం ఇదే!

Akhanda 2 Release Stalled Eros Now Financial Dispute Surfaces
  • బాలకృష్ణ 'అఖండ 2' విడుదల హఠాత్తుగా వాయిదా
  • సాంకేతిక కారణాలు కాదు.. ఆర్థిక వివాదమే అసలు కారణం
  • నిర్మాణ సంస్థ 14 రీల్స్‌పై ఈరోస్ నౌ వేసిన కేసు
  • మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో నిలిచిన ప్రదర్శనలు
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ 2' రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల కాకపోవడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ చిత్రం  విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని అడ్డంకి ఎదురైంది. సాంకేతిక అంశాలే కారణమని ప్రచారం జరిగినప్పటికీ, దీని వెనుక ఓ పాత ఆర్థిక వివాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌకు మధ్య ఉన్న బకాయిల గొడవే ఈ వాయిదాకు ప్రధాన కారణం. గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన '1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలకు ఈరోస్ నౌ సంస్థ ఆర్థిక భాగస్వామిగా వ్యవహరించింది. ఆ సినిమాలు భారీ నష్టాలు చవిచూడటంతో, 14 రీల్స్ సంస్థ ఈరోస్ నౌకు సుమారు రూ. 27.8 కోట్లు బకాయి పడింది.

ఈ వివాదాన్ని పరిష్కరించకుండానే, నిర్మాతలు '14 రీల్స్ ప్లస్' అనే కొత్త బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో తమ బకాయిల కోసం ఈరోస్ నౌ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం, ఈరోస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ 'అఖండ 2' విడుదలపై స్టే విధించింది. కోర్టు ఆదేశాలతో భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ అన్ని షోలను రద్దు చేశారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. ఈ అనూహ్య పరిణామంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Akhanda 2
Nandamuri Balakrishna
Boyapati Srinu
14 Reels Plus
Eros Now
financial dispute
Tollywood movie release
Ram Achanta
Gopi Achanta
Madras High Court

More Telugu News