Shiva Yadav: గుజరాత్‌లో లిక్కర్ మాఫియా కిరాతకం.. ముగ్గురిని కిడ్నాప్ చేసి, ఇద్దరిని చంపేశారు!

Shiva Yadav Liquor Mafia Kills Two in Gujarat Kidnapping
  • సూరత్‌లో ముగ్గురి కిడ్నాప్, ఇద్దరి దారుణ హత్య
  • లిక్కర్ మాఫియా డాన్ శివ యాదవ్ ప్రధాన సూత్రధారి
  • గుజరాత్‌లో ఒకరు, మహారాష్ట్రలో మరొకరి హత్య
  • కేసును ఛేదించిన పోలీసులు, ఇద్దరు సహచరుల అరెస్ట్
గుజరాత్‌లోని సూరత్‌లో లిక్కర్ మాఫియా డాన్ శివ యాదవ్ అలియాస్ శివ టక్లా ఘాతుకానికి పాల్పడ్డాడు. ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసి, వారిలో ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడైన శివ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1న రాత్రి షోయబ్ ఫిరోజ్ షేక్, నజీమ్ అలియాస్ భంజా సాదిక్, ఇర్షాద్ అలియాస్ కాలియా ఖాదర్ సయ్యద్‌లను శివ టక్లా, అతని అనుచరులు కిడ్నాప్ చేశారు. అనంతరం షోయబ్ తల్లికి ఫోన్ చేసి, లక్ష రూపాయలు ఇస్తేనే కొడుకును విడిచిపెడతామని బెదిరించారు. అయితే, అదే ఫోన్ నుంచి తన తల్లితో షోయబ్ మాట్లాడుతూ కేవలం రూ.20,000 మాత్రమే ఇవ్వమని చెప్పడంతో ఆ మొత్తాన్ని ఆమె వారికి ఇచ్చింది. అయినా కొడుకు తిరిగి రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు గోదాదర ప్రాంతంలో ఒంటి నిండా గాయాలతో ఉన్న షోయబ్ మృతదేహం లభించింది. దీంతో ఈ కేసును హత్య కేసుగా మార్చి విచారణను ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా, పొరుగున ఉన్న మహారాష్ట్ర పోలీసుల నుంచి గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు సూరత్ పోలీసులకు సమాచారం అందింది. మృతుడిని నజీమ్‌గా గుర్తించారు. కిడ్నాప్‌కు గురైన మూడో వ్యక్తి ఇర్షాద్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

ఈ కేసులో పోలీసులు ఆసిఫ్ మోతీ షేక్, జాలం అలియాస్ జగదీష్ ననురామ్ కలాల్‌లను అరెస్ట్ చేశారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. సోమవారం రాత్రి శివ టక్లాకు తాము సహకరించినట్లు తెలిపారు. షోయబ్‌ను సూరత్‌లోనే హత్య చేసి, నజీమ్, ఇర్షాద్‌లను మహారాష్ట్రకు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ నజీమ్‌ను చంపి, నందుర్‌బార్‌లోని తడోడా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నారు. ప్రధాన నిందితుడు శివ టక్లాపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని, ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Shiva Yadav
Shiva Takla
Surat
Gujarat
Liquor Mafia
Kidnapping
Murder
Crime
Police Investigation

More Telugu News