Asim Munir: పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్

Asim Munir Appointed Pakistans Chief of Defence Forces
  • పాక్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా అసిమ్ మునీర్
  • దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారిన ఆర్మీ మాజీ చీఫ్
  • అధ్యక్షుడితో సమానంగా న్యాయపరమైన రక్షణ
  • త్రివిధ దళాల సమన్వయం కోసం కొత్తగా సీడీఎఫ్ పదవి ఏర్పాటు
పాకిస్థాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను కొత్తగా సృష్టించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పదవిలో నియమించింది. ఈ నియామకంతో ఆయన పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఏకీకృతం చేసే లక్ష్యంతో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాక్ ప్రభుత్వం ఈ సీడీఎఫ్ పదవిని తీసుకొచ్చింది. ప్రధాని సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నియామకాన్ని ఆమోదించినట్టు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పదవిలో మునీర్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. సీడీఎఫ్‌గా ఆయనకు అధ్యక్షుడితో సమానంగా న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. దీనివల్ల ఆయనపై ఎలాంటి విచారణ జరిపే అవకాశం ఉండదు.
 
ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన అసిమ్ మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను కూడా అందుకున్నారు. పాక్ చరిత్రలో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో వ్యక్తి మునీర్ కావడం విశేషం. గత నెల 29న ఆయన ఆర్మీ చీఫ్ పదవీ కాలం ముగిసింది.
 
కాగా, ఈ నియామకానికి ముందు ప్రభుత్వం, సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయని, ప్రధాని షేక్ బాజ్ షరీఫ్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, వాటన్నింటికీ తెరదిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Asim Munir
Pakistan
Chief of Defence Forces
Pakistan Army
General Asim Munir
Pakistan Military
Army Navy Airforce
Sheikh Baz Sharif
Asif Ali Zardari

More Telugu News