Chandrababu Naidu: ఆ ఒప్పందాలన్నీ 45 రోజుల్లో కార్యరూపం దాల్చాలి: సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Naidu Orders Implementation of Agreements in 45 Days
  • రాష్ట్రానికి రూ.20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
  • రాష్ట్రంలో 56,278 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు
  • ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వల్లే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయన్న చంద్రబాబు
  • రూ.500 కోట్లతో రాష్ట్రంలో సావరిన్ ఫండ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సూచన
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ.20,444 కోట్ల విలువైన నూతన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 56,278 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన 13వ ఎస్ఐపీబీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల (ఎంఓయూ) పురోగతిపై కూడా సీఎం సమీక్షించారు. సదస్సులో కుదిరిన ఒప్పందాలలో ఇప్పటికే 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, రాబోయే 45 రోజుల్లోగా మెజారిటీ ఒప్పందాలకు శంకుస్థాపనలు జరగాలని అధికారులను ఆయన గట్టిగా ఆదేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం వల్లే ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ వంటి దేశానికి చెందిన కంపెనీలను కూడా ఇబ్బందులకు గురిచేశారు. అలాంటి పరిస్థితులుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, అంతర్జాతీయంగా చెడ్డపేరు వస్తుంది. మేము ఆ ప్రతికూల వాతావరణాన్ని చెరిపివేసి, ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకువచ్చాం. దాని ఫలితమే విశాఖ సదస్సు విజయవంతం కావడం" అని అన్నారు.

ఒప్పందాల అమలుపై ప్రత్యేక దృష్టి

విశాఖ సదస్సు జరిగి 20 రోజులు గడవకముందే రూ.7.69 కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. "మిగిలిన ఎంఓయూలను కూడా వేగంగా పట్టాలెక్కించాలి. 45 రోజుల్లోగా అన్నింటినీ గ్రౌండింగ్ చేయాలి. వీలైనన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు చేసి దావోస్ సదస్సుకు వెళితే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతివారం సమీక్షించాలి. ఇకపై ఎస్ఐపీబీతో పాటు ఎంఓయూల పురోగతిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు. భూసేకరణలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

భవిష్యత్ ప్రణాళికలు, నూతన ఆలోచనలు

రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని సీఎం అన్నారు. "క్వాంటం వ్యాలీకి ఒక సలహా మండలిని నియమించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాథమిక అంశాలను 7వ తరగతి నుంచే పాఠ్యాంశంగా చేర్చాలి. దీనికోసం మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల సహకారం తీసుకోండి" అని సూచించారు. దుబాయ్, యూఏఈ తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా రూ.500 కోట్ల ప్రారంభ మూలధనంతో 'సావరిన్ ఫండ్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పశువుల దాణాను డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా తయారు చేయించే పరిశ్రమలను ప్రోత్సహించాలని, దీనికి నరేగా నిధులను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలను హార్టికల్చర్ హబ్‌లుగా అభివృద్ధి చేసి, ఉత్పత్తుల ఎగుమతికి అవసరమైన రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 50 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థాయిని బట్టి ప్రోత్సాహకాలు అందించే పారదర్శక విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh investments
SIPB
Visakha summit
MoUs
AP industries
Job creation
Ease of doing business
AP economy
Davos summit

More Telugu News