Allu Arjun: అల్లు అర్జున్ రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు: పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై దిల్ రాజు

Allu Arjun Donates 2 Crore Rupees After Pushpa2 Stampede Says Dil Raju
  • భాస్కర్ కుటుంబానికి సాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరించిన దిల్ రాజు
  • బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్ డబ్బులు డిపాజిట్ చేశారని వెల్లడి
  • వడ్డీలో నెలకు రూ.75 వేలు భాస్కర్ కుటుంబ ఖర్చులు, ఆసుపత్రి బిల్లులకు వినియోగిస్తున్నట్లు వెల్లడి
  • భాస్కర్ అదనపు సాయం కోరుతున్నారన్న దిల్ రాజు
పుష్ప-2 విడుదల సమయంలో గతేడాది సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ భార్య రేవతి మృతి చెందగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ విషాద ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా భాస్కర్ కుటుంబానికి అందుతున్న సహాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు వివరించారు. దిల్ రాజు, భాస్కర్ మరియు ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చేరాడని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చి రూ.2 కోట్లు డిపాజిట్ చేశారని చెప్పారు. దానిపై వచ్చే వడ్డీలో నెలకు రూ.75 వేలు భాస్కర్ కుటుంబ ఖర్చులకు, శ్రీతేజ్ ఆసుపత్రి బిల్లులకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి, ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఆసుపత్రి ఖర్చుల కోసం అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇప్పటికే రూ.75 లక్షలు చెల్లించారని ఆయన తెలిపారు. ఇప్పుడు భాస్కర్ అదనపు సహాయం కోరుతున్నారని, ఈ విషయాన్ని అల్లు అర్జున్ దృష్టికి తీసుకువెళతానని దిల్ రాజు అన్నారు. శ్రీతేజ్‌కు అవసరమైతే ఏడాది పాటు రిహాబిలిటేషన్ సదుపాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ప్రమాదం జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్, బన్నీ వాసుల సహకారం తమకు అందుతోందని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నారని, అయినప్పటికీ ఇప్పుడు అదనపు సహాయం అవసరమైందని ఆయన అన్నారు. శ్రీతేజ్‌కు ఆరు నెలల పాటు రిహాబిలిటేషన్ కొనసాగించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని దిల్ రాజు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన అల్లు అర్జున్‌తో మాట్లాడారని భాస్కర్ తెలిపారు.
Allu Arjun
Pushpa 2
Dil Raju
SreeTej
Hyderabad
Sadhya Theatre
Accident Compensation

More Telugu News