Lavu Sri Krishna Devarayalu: తిరుపతి కేంద్రంగా 'బాలాజీ రైల్వే డివిజన్'... కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు టీడీపీ ఎంపీల వినతి

Balaji Railway Division Centered in Tirupati Request to Minister Ashwini Vaishnaw
  • కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు
  • రాయలసీమ అభివృద్ధి, మెరుగైన రైలు సేవల కోసం వినతి
  • తిరుపతి స్టేషన్ ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయం తెస్తోందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తిరుపతి కేంద్రంగా ‘బాలాజీ రైల్వే డివిజన్’ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలోని బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఈ మేరకు ఒక సవివరమైన వినతి పత్రాన్ని అందజేసింది.

ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందిస్తూ... రాయలసీమ ప్రాంతంలో 300 కిలోమీటర్ల పరిధిలో ఒక్క రైల్వే డివిజన్ కూడా లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. తిరుపతి స్టేషన్ ఏటా సుమారు రూ.250 కోట్ల ఆదాయం ఆర్జిస్తూ, దేశంలోనే అత్యధిక ఆదాయం గల స్టేషన్లలో ఒకటిగా ఉందని గుర్తుచేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో, రాయలసీమలో సమగ్రాభివృద్ధి, సమర్థవంతమైన రైలు సేవలు అందించడానికి ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చాలా అవసరమని తమ విజ్ఞాపనలో పేర్కొన్నట్టు వివరించారు.

ప్రతిపాదిత బాలాజీ రైల్వే డివిజన్ 1,550 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాన్ని కవర్ చేస్తుందని ఎంపీ వివరించారు. ఈ డివిజన్ ఏర్పడితే చెన్నై, బెంగళూరు, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. తిరుపతి–ఒంగోలు, పాకాల–ధర్మవరం, రేణిగుంట–యర్రగుంట్ల, నంద్యాల, నడికుడి, కృష్ణపట్నం వంటి ప్రధాన మార్గాలతో పాటు, ప్రతిపాదిత కడప–బెంగళూరు లైన్ కూడా ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయని తమ వినతిపత్రంలో పేర్కొన్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.
Lavu Sri Krishna Devarayalu
Balaji Railway Division
Tirupati
Ashwini Vaishnaw
Rayalaseema
Andhra Pradesh
Railway Division
TDP MP
Indian Railways

More Telugu News