Swaraj Kaushal: దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూత

Swaraj Kaushal husband of Sushma Swaraj dies at 73
  • 73 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన మిజోరం మాజీ గవర్నర్
  • కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సోషల్ మీడియాలో నివాళి
  • లోధీ రోడ్ శ్మశానవాటికలో ఇవాళ‌ సాయంత్రం అంత్యక్రియలు
  • మిజోరం శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన న్యాయకోవిదుడు
దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ భర్త, సీనియర్ న్యాయవాది, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ (73) ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమార్తె, ఢిల్లీ బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ భావోద్వేగ నివాళి అర్పించారు.

"నాన్నా స్వరాజ్ కౌశల్ జీ, మీ ఆప్యాయత, క్రమశిక్షణ, దేశభక్తి, అపారమైన సహనం నా జీవితానికి ఎప్పటికీ వెలుగునిస్తాయి. మీ నిష్క్రమణ తీవ్రమైన వేదనను మిగిల్చినా, ఇప్పుడు మీరు అమ్మతో కలిసి భగవంతుని సన్నిధిలో శాశ్వత శాంతితో ఉంటారనే నమ్మకం నాకుంది. మీ కుమార్తెగా పుట్టడం నా జీవితంలో గొప్ప గర్వకారణం" అని బన్సూరి తన పోస్టులో పేర్కొన్నారు.

1952 జులై 12న సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్, ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచారు. ఆయన 1990 నుంచి 1993 వరకు మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలందించారు. 1975లో సుష్మా స్వరాజ్‌ను వివాహం చేసుకున్నారు. వారి ఏకైక సంతానం బన్సూరి స్వరాజ్. సుష్మా స్వరాజ్ 2019లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

న్యాయవాదిగా తన కెరీర్‌లో స్వరాజ్ కౌశల్ ఎన్నో కీలక కేసులు వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో బరోడా డైనమైట్ కేసులో సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెజ్‌ తరఫున వాదించి గుర్తింపు పొందారు. ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై నిపుణుడిగా ఆయనకు మంచి పేరుంది. 1986లో మిజోరం శాంతి ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించి, 20 ఏళ్ల తిరుగుబాటుకు ముగింపు పలికారు.

ఇవాళ‌ సాయంత్రం ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వ‌హించారు. కౌశల్ మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.
Swaraj Kaushal
Sushma Swaraj
Bansuri Swaraj
Mizoram Governor
Senior Advocate
BJP MP
George Fernandes
Baroda Dynamite Case
Haryana Vikas Party
Rajya Sabha

More Telugu News