Delivery Boy: రూ. 25 లక్షల ఉద్యోగాన్ని వదిలి.. డెలివరీ బాయ్‌గా మారిన టెకీ.. ఎందుకో తెలుసా?

Bengaluru Man Ditches Rs 25 Lakh Job To Deliver Food
  • క్లౌడ్ కిచెన్ ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో మార్కెట్ రీసెర్చ్ చేస్తున్న యువ‌కుడు
  • కుటుంబం, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత, అవమానాలు.. అయినా వెన‌క్కి త‌గ్గ‌ని వైనం
  • అతని నిర్ణయంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన వ్యాపార కలను సాకారం చేసుకునేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడాదికి రూ. 25 లక్షల జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాడు. అతని స్నేహితుడు ఈ విషయాన్ని 'ఎక్స్' సోషల్ మీడియాలో పంచుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

త్వరలో సొంతంగా ఒక క్లౌడ్ కిచెన్ ప్రారంభించాలనేది అతని ప్రణాళిక. అందుకోసం తన యూనివర్సిటీ సమీప ప్రాంతంలో ఎలాంటి ఆహారానికి గిరాకీ ఉంది, వినియోగదారులు ఏ ధరలకు కొనడానికి ఇష్టపడుతున్నారు, ఏయే ప్రాంతాల్లో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్షేత్రస్థాయి పరిశోధన కోసమే అతను డెలివరీ బాయ్‌గా అవతారమెత్తాడు.

అయితే, అతని నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతుండటం, కొత్తగా కారు కొనడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు స్నేహితులు అతణ్ని ఎగతాళి చేయగా, డెలివరీ యూనిఫాంలో ఉన్నప్పుడు లిఫ్ట్ వాడుతున్నందుకు వాచ్‌మన్లు తిట్టడం వంటి అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు.

ఇన్ని అడ్డంకులు ఎదురైనా అతను వెనక్కి తగ్గలేదు. తన పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ అమ్ముడయ్యే 12 రకాల ఆహార పదార్థాలను గుర్తించాడు. ఈ మోడల్‌తో 3-4 నెలల్లోనే లాభాలు సాధించగలనని అతను ధీమాగా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇదే అసలైన వ్యాపార దక్షత" అని, "క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడమే నిజమైన మార్కెట్ రీసెర్చ్" అని కామెంట్లు పెడుతున్నారు.
Delivery Boy
Cloud Kitchen
Startup
Entrepreneurship
Food Delivery
Business Plan
Market Research
Bangalore
Viral News

More Telugu News