Vladimir Putin: భారత్ పర్యటన వేళ పుతిన్ ఆస్తిపై చర్చ... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడా?

Vladimir Putins Net Worth Under Scrutiny During India Trip
  • అధికారికంగా సాధారణ జీవి.. కానీ 200 బిలియన్ డాలర్ల ఆస్తిపరుడని అంచనా
  • రూ.6,000 కోట్ల విలాసవంతమైన నౌక, నల్ల సముద్రంలో భారీ ప్యాలెస్
  • నమ్మకస్తుల పేర్లతో ఆస్తులు.. అంతుచిక్కని సంపద రహస్యం
  • ఆంక్షలు ఉన్నా పెరుగుతున్న రష్యా కుబేరుల సంపద
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ‌ సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన భద్రతా ఏర్పాట్లపై చర్చ జరుగుతుండగానే, ఆయన వ్యక్తిగత సంపద ఎంత అనే అంశం మరోసారి అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

క్రెమ్లిన్ అధికారిక లెక్కల ప్రకారం పుతిన్ ఒక సాధారణ ప్రజా సేవకుడు. ఆయన వార్షిక జీతం సుమారు 140,000 డాల‌ర్లు (సుమారు కోటి రూపాయలు). ఆయన పేరు మీద 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, ఒక చిన్న భూమి, మూడు వాహనాలు మాత్రమే ఉన్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అయితే, అంతర్జాతీయ నిపుణులు, ఫైనాన్షియర్లు వేస్తున్న అంచనాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పుతిన్ ఆస్తి విలువ దాదాపు 200 బిలియన్ డాలర్లు ఉండొచ్చని, ఒకప్పుడు రష్యాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉన్న బిల్‌ బ్రౌడర్ 2017లోనే అమెరికా సెనేట్‌కు తెలిపారు. ఇది నిజమైతే, పుతిన్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ వంటి వారిని కూడా అధిగమిస్తారు.

పుతిన్ అధికారిక జీతం కంటే కొన్ని రెట్లు ఎక్కువ విలువైన లగ్జరీ వాచ్‌లు ధరించి కనిపిస్తుంటారు. అంతేకాకుండా  సుమారు రూ.6,000 కోట్ల విలువైన సూపర్ యాట్ (లగ్జరీ బోటు), నల్ల సముద్రం తీరంలో ఉన్న బిలియన్ డాలర్ల 'పుతిన్ ప్యాలెస్' వంటి అత్యంత ఖరీదైన ఆస్తులతో ఆయనకు సంబంధం ఉందని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం గతంలో వెల్లడించింది. ఈ ప్యాలెస్ అధికారికంగా ఆయన సన్నిహితుడి పేరు మీద ఉంది.

సంపదను ఎలా కూడబెట్టారు?
పుతిన్ తన సంపదను రెండు ప్రధాన మార్గాల్లో కూడబెట్టినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. మొదటిది, రష్యాలోని సంపన్న వ్యాపారవేత్తలను (ఒలిగార్క్స్) బెదిరించి, వారి కంపెనీలలో వాటాలు లేదా భారీగా డబ్బు వసూలు చేయడం. రెండోది, తన స్నేహితులు, బంధువులు, విధేయులకు ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టి, వారి ద్వారా ముడుపులు పొందడం.

పుతిన్ తన సంపదను నేరుగా తన పేరు మీద కాకుండా అత్యంత నమ్మకస్తులైన స్నేహితులు, బంధువులు, భద్రతా అధికారుల పేర్ల మీద దాచిపెట్టినట్లు ఫోర్బ్స్ వంటి పత్రికలు పేర్కొంటున్నాయి. 2016 నాటి 'పనామా పేపర్స్' లీక్స్‌లో కూడా పుతిన్ సన్నిహితుల పేర్ల మీద ఉన్న 2 బిలియన్ డాలర్ల ఆస్తుల వివరాలు బయటపడ్డాయి.

ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించినా, పుతిన్ లేదా ఆయన సన్నిహితుల సంపద ఏమాత్రం తగ్గలేదు. పైగా 2024 ఏప్రిల్ నాటికి రష్యాలోని సంపన్నుల ఆస్తులు 72 బిలియన్ డాలర్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Vladimir Putin
Putin India visit
Putin wealth
Russian President
Putin net worth
Russia India Summit
Putin palace
Russian oligarchs
Panama Papers
Russian economy

More Telugu News